One Earth One Life

Farmizen

CategorIes:

By

·

3–4 minutes

‘ఫార్మీజనా’ సుఖినోభవంతు
కోరింది పండిస్తారు అడిగింది అందిస్తారు

    పురుగు మందుల జాడ లేదు… కాలుష్యం బాధ లేదు… ధరల దాడి ఉండదు… భూమి రైతుది… సాగు మీది… ఏ కాయగూర కావాలంటే అది… మీ ఆరోగ్యానికి భరోసా మాది..
    … ఇది ఓ సంస్థ సామాన్యులకు ఇస్తున్న హామీ
    మన్నికైన భూమిని ఎంపిక చేసి, వినియోగదారులు కోరుకున్న స్వచ్ఛమైన తాజా కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేసి వారింటికే తెస్తున్న ఫార్మీజెన్‌ కథ ఇది…

ఆర్గానిక్‌ కూరగాయలు.. ఇప్పుడు మెట్రో నగరాల్లో బాగా వినిపిస్తున్న మాట. ఆన్‌లైన్‌ అంగట్లో.. సూపర్‌ మార్కెట్లో.. ప్రత్యేకంగా కనిపిస్తాయవి. పైకమూ ఎక్కువే. ‘ఫార్మీజెన్‌’ కూడా సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలే అమ్ముతుంది. ఆన్‌లైన్‌ వేదికగానే వ్యాపారం నిర్వహిస్తోంది. మిగతా ఆర్గానిక్‌ కాయగూరలకు, ఫార్మీజెన్‌కు తేడా ఒకటుంది. వినియోగదారులు కోరిన కూరగాయలు పండిస్తారిక్కడ. వారి కళ్లముందే సాగు చేస్తారు. వారం వారం వారడిగిన తాజా కూరగాయలు అందిస్తారు. పండిస్తున్న తీరును వెళ్లి స్వయంగా పరిశీలించవచ్చు. పెట్టుబడికీ, దిగుబడికీ పొంతన లేని వ్యవసాయక్షేత్రంలో ఫార్మీజెన్‌ ఫార్ములాను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు షమీక్‌, గీతాంజలి దంపతులు. వ్యవసాయంపై ఆసక్తి, రైతుపై అభిమానం, కొత్తగా ఏదైనా చేయాలనే తపన వారిని సాగుదారిలో సాగేలా చేసింది.

డిమాండ్‌ ఎక్కువే..
గీతాంజలి కేరళలో చదువు పూర్తి చేసింది. టీసీఎస్‌ కంపెనీలో ఇంజినీర్‌గా ఎనిమిదేళ్లు పనిచేసింది. ఉద్యోగంపై ఆసక్తి పోయింది. గార్డెనింగ్‌ ఆమె అభిరుచి. దానినే కెరీర్‌గా మలుచుకోవాలనుకుంది. ఉద్యోగానికి రాజీనామా చేసి ‘గ్రీన్‌ మై లైఫ్‌’ పేరుతో ల్యాండ్‌స్కేప్‌ రంగంలో అడుగుపెట్టింది. రైతు కుటుంబంలో పుట్టిన గీతాంజలికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పొలం పనులు చేస్తుంటే ఆసక్తిగా గమనించేది. గీతాంజలిని పెళ్లాడిన షమీక్‌ బిట్స్‌పిలానీ విద్యార్థి. కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగి. ఆయనకూ వ్యవసాయం అంటే ఆసక్తి. దంపతుల ఆలోచనలన్నీ మట్టి చుట్టూ తిరిగేవి. బెంగళూరులో ఉండగా.. కూరగాయలు కొన్నప్పుడల్లా వారి మధ్య ఓ చర్చ జరిగేది. ‘తాజాగా ఉన్నా.. వీటిలో ఏదో తేడా ఉంది..’ అనుకునేవాళ్లు. రసాయన మందులతో పండించడం వల్ల రుచిలో తేడా వస్తోందని అర్థమైంది వారికి. సేంద్రియ పద్ధతిలో తామే కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వారికి. మార్కెట్‌లో అప్పటికే ‘ఆర్గానిక్‌ కూరగాయల’ విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. అలాంటి కాయగూరలు విక్రయించే దుకాణాలు కిటకిటలాడటం గమనించారు. ‘ఎక్కడో సేంద్రియ పద్ధతిలో పండించామని చెబుతున్న కూరగాయలకే ఇంత డిమాండ్‌ ఉంటే.. వినియోగదారులకు ఇష్టమైన కూరగాయలు వారి ఎదుటే పండించి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది మాకు’ అంటారు గీతాంజలి.

రైతులతో ముందడుగు..
తమ ఆలోచనను అమలు చేయడం అంత సులభమైన పనేం కాదని వారికి తెలుసు. దంపతులిద్దరూ కలిసి రెండేళ్లు పరిశోధనలు చేశారు. ఈ ప్రణాళిక అమలు చేయడానికి అన్ని మార్గాలనూ అన్వేషించారు. మొదట బెంగళూరు వేదికగా ఫార్మీజెన్‌ సేవలు ప్రారంభించారు. ఈ సేంద్రియ క్రతువులో రైతులకూ లాభం కలిగించాలని సంకల్పించుకున్నారు. బెంగళూరు శివారులోని రైతులను కలుసుకొని.. వారికి నచ్చజెప్పి.. వారి భాగస్వామ్యంతో కాయగూరల సాగు మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోనూ ఫార్మీజెన్‌ విస్తరించింది. చిలుకూరు సమీపంలో రెండు వ్యవసాయక్షేత్రాలు, గచ్చిబౌలి సమీపంలో మరో పొలంలో రైతులతో కలిసి.. సాగుభళా అనిపిస్తున్నారు.

విభజించి సాగు..
వ్యవసాయ క్షేత్రాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించి.. వినియోగదారులకు అద్దెకివ్వడం ఫార్మీజెన్‌ ప్రత్యేకత. ఎకరం స్థలానికి 20/30 అడుగుల చొప్పున 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 60 విభాగాలుగా విడదీశారు. వినియోగదారులకు ఒక్కో భాగాన్ని అద్దెకిస్తారు. అందులో కస్టమర్లు కోరిన కూరగాయలు పండిస్తారు. అద్దె నెలకు రూ.2,500. అందులో సగం రూ.1,250 రైతుకు చెల్లిస్తారు ఫార్మీజెన్‌ నిర్వాహకులు. ఈ లెక్కన ఎకరం పొలం 60 భాగాలుగా విభజించడంతో 60 మంది వినియోగదారులు చెల్లించే మొత్తంలో సగం రైతుకే అందుతుంది. అన్ని ఖర్చులూ పోగా నెలకు 40 వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు రైతులు. మరోవైపు నెల రోజుల పాటు ఆ విభాగంలో పండించిన కూరగాయలన్నీ వినియోగదారుడికే అందుతాయి. వారానికి ఒకట్రెండుసార్లు వారు అడిగిన కూరగాయలు హోమ్‌డెలివరీ చేస్తారు. కోరుకున్న పంటలు పండించి ఇవ్వడమే కాదు.. వ్యవసాయ క్షేత్రాన్ని కూడా వినియోగదారులు సందర్శించవచ్చు. అక్కడ ఉన్న కూరగాయలను తమవెంట తీసుకెళ్లొచ్చు.

నాణ్యత.. రుచి..

మాకు నచ్చిన కూరగాయలే పండించుకునే అవకాశం ఉండటం గొప్ప విషయం. ఇక్కడ పండిన కొత్తిమీర వాసన ఎంత బాగుందో. టమాటా రుచి గురించైతే చెప్పక్కర్లేదు. ఒక నెల అద్దె చెల్లించి ఎలా ఉంటుందో చూద్దామనుకున్నా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడూ పొలానికి వెళ్తుంటాం. సొంతంగా పండించుకుంటున్నామన్న అనుభూతి కలుగుతోంది.
– ప్రియాశరత్‌, వినియోగదారురాలు

యాభైకిపైగా

ఫార్మీజెన్‌ క్షేత్రంలో యాభై రకాలకు పైగా కూరగాయలు సాగవుతున్నాయి. టమోటా, ఉల్లిపాయ, అనపకాయ, బెండకాయలు, దొండకాయలు, కాలీఫ్లవర్‌, రకరకాల దుంపలు, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఇలా రకరకాల కాయగూరలు పండిస్తున్నారు. వినియోగదారుడికి వారానికోసారి వారు కోరుకున్న కూరగాయలన్నీ కలిపి పది కిలోలు కాటన్‌ బ్యాగులో ఉంచి డెలివరీ చేస్తారు.
ఫార్మీజెన్‌ సాగులో.. వేపనూనె, జీవామృతం, ఆవుపేడ వంటి సహజమైన ఎరువులనే వాడతారు.

30 కి.మీ. లోపే..
వినియోగదారులు.. ఫార్మీజెన్‌ సంస్థ వ్యవసాయక్షేత్రానికి 30 కిలోమీటర్ల లోపే ఉండాలి. రద్దీగా ఉండే నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య అధికం. దగ్గరగా ఉంటే కూరగాయలు సులభంగా డెలివరీ చేయవచ్చంటారు నిర్వాహకులు. అంతేకాదు వినియోగదారులు సైతం అప్పుడప్పుడు వచ్చి వారి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పుడు బాగుంది..

నాకున్న రెండెకరాల్లో ఫార్మీజెన్‌తో కలిసి సాగుచేస్తున్నా. ఎకరానికి 60 చొప్పున 120 విభాగాలున్నాయి. నెలకు లక్షన్నర వరకు ఆదాయం వస్తోంది. ఖర్చులన్నీ పోగా.. ఎకరాకు నలభై వేల రాబడి ఉంది. సొంతంగా వ్యవసాయం చేసినప్పుడు ఇంత ఆదాయం ఎప్పుడూ రాలేదు. ఫార్మీజెన్‌లో చేరడానికి చాలామంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
– నరేష్‌, రైతు

యాప్‌తో ముందుకు..

కొత్త విధానంతో ముందుకొచ్చిన ఫార్మీజెన్‌ను ఆదరిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మొబైల్‌ అప్లికేషన్‌ రూపొందించడంతో ఆదరణ పెరిగింది. ‘ఈ కాలంలో అందరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. వారి కోసం ఫార్మీజెన్‌ (farmizen) యాప్‌ను తీసుకొచ్చాం. ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే మా కుటుంబంలో భాగస్వాములైనట్టే’ అంటారు గీతాంజలి. యాప్‌లో ఫార్మీజెన్‌ ఆధ్వర్యంలోని వ్యవసాయ క్షేత్రాల వివరాలు, వారు పండిస్తున్న కూరగాయలు, ఎలా బుక్‌ చేసుకోవాలి, అద్దె చెల్లింపు వంటి ఆప్షన్లన్నీ ఉంటాయి. బ్లోహార్న్‌ సంస్థ సహకారంతో కూరగాయల డెలివరీ చేస్తున్నారు. యాభై వాహనాల ద్వారా డెలివరీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫార్మీజన్‌ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. దీనిని మరింత విస్తరిస్తామంటున్నారు గీతాంజలి, షకీమ్‌ దంపతులు.
– సీహెచ్‌ వసుంధరాదేవి

Leave a comment